జనగణనతో సంక్షేమ పథకాలు ఆగవు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా

  • జనాభా గణనపై అపోహలు వద్దన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • గణాంకాలతో సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ
  • తెలంగాణలో ప్రారంభమైన దేశపు తొలి పూర్తి డిజిటల్ జనగణన
  • మే 10 వరకు ఆన్‌లైన్‌లో స్వీయ నమోదుకు అవకాశం
దేశాభివృద్ధికి జనాభా గణన అత్యంత కీలకమని, ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ వివరాలను నమోదు చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా గణనలో సరైన వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఇచ్చే ప్రతి సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లో నిన్న తన వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, 2027 జనాభా గణన 'స్వీయ నమోదు' (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మాకు ఇల్లు ఉందని చెబితే పథకాలు రాకపోవచ్చని, ఇంట్లో ఏసీ ఉందని చెబితే ప్రయోజనాలు తగ్గిపోతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలనే స్పష్టత కోసమే ఈ వివరాలు సేకరిస్తాం తప్ప, పథకాల కోతకు కాదు" అని భరోసా ఇచ్చారు.

భారతదేశపు తొలి పూర్తి డిజిటల్ జనాభా గణన ఇదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనగణన కూడా ఇదే కావడం విశేషమని తెలిపారు. ప్రజలు మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అనంతరం, మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు.

Kishan Reddy
Census 2027
Population Census
Telangana
Central Government Schemes
Digital Census
Self Enumeration
Dilkusha Guest House
Hyderabad

More Telugu News